ఎల్లుండి రైతు ఖాతాల్లో రైతుబంధు జమ

రైతుబంధు కు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో ఆ డబ్బులు ఎప్పుడు పడతాయో..అని రైతులంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎల్లుండి (నవంబర్ 28) సాయంత్రం 5 గంటలోపు రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేయాలనీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈరోజు, రేపు బ్యాంకులకు సెలవులు ఉండడంతో ఎల్లుండి జమ చేయబోతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.10,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన నిధులు జమ చేసినప్పటికీ.. యాసంగి సీజన్ కోసం రెండో విడత నిధులు నవంబర్‌లోనే రైతులకు అందించాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్ రావడంతో కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.

ఎన్నికల ముందు రైతుబంధు నగదు పంపిణీకి అనుమతి ఇవ్వకూడదని, అది ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలంగాణ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి, సీఈవోకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల ముందు రైతుబంధు నిధులు బదిలీ చేయకుండా చర్యలు తీసుకోవాలని అటు ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నర్స్’ సంస్థ కూడా ఈసీని ఆశ్రయించింది.

రైతుబంధు కింద నగదు బదిలీకి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని కోరింది. రాష్ట్రంలో రైతుబంధు ఎప్పటి నుంచో అమల్లో ఉన్న పథకమని, ఇది కొత్తదేమీ కాదని వివరణ ఇచ్చింది. ఇరు పక్షాల వాదనలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం చివరికి రైతుబంధు నిధుల పంపిణీకి అనుమతి ఇస్తూ శుక్రవారం (నవంబర్ 24) ఆదేశాలు జారీ చేసింది.