ప్రకాశం జిల్లాలో పెన్షన్ పంపిణీలో నకిలీ నోట్ల కలకలం

పెన్షన్ పంపిణీలో నకిలీ నోట్ల వచ్చిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నరసాయిపాలెం లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీలో వాలంటీరు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఓ లబ్ధిదారు పింఛను నగదుతో ఓ దుకాణానికి వెళ్లగా అందులో నకిలీ నోట్లు గుర్తించారు.

ఈ విషయాన్ని వెంటనే వారు సదరు వాలంటీరు దృష్టికి తీసుకువెళ్లగా.. ఆ పెన్షన్ పంపిణీ సొమ్ములో మరిన్ని నకిలీ నోట్లు కనిపించాయి. దీంతో గ్రామంలో 19 వేల విలువైన 500 నకిలీ నోట్లను లబ్ధిదారుల నుంచి వాలంటీరు తీసుకొని అధికారులకు అప్పగించారు. ఆ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వం జనవరి నుంచి పెంచిన పింఛన్లను ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి శ్రీకారం చుట్టింది. నకిలీ నోట్లు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.