హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలకు పోలీసుల రూల్స్ …

మరో 10 రోజుల్లో కొత్త ఏడాది రాబోతుంది. ఈ క్రమంలో కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు అంత సిద్ధం అవుతున్నారు. అలాగే హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకల కోసం పలు హోటల్స్ , క్లబ్స్ ఇలా అన్ని కూడా సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు పలు రూల్స్ విధించారు. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించేవారు అనుసరించాల్సిన నియమ నిబంధనలపై నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు నిర్వహించే 3 స్టార్‌, ఆ పైస్థాయి హోటల్స్‌, క్లబ్స్‌, పబ్స్‌ తప్పనిసరిగా పదిరోజుల ముందు అనుమతి తీసుకోవాలని తెలిపారు. బయట తగిన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడంతోపాటు డ్రగ్స్‌, ఆయుధాలు ఎట్టి పరిస్థితుల్లోను లోపలికి అనుమతించొద్దని ఆదేశించారు.

నిబంధనలు అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అలాగే, డీజే, మ్యూజిక్‌ సిస్టంలతోపాటు పటాకుల శబ్దాలు 45 డెసిబుల్స్‌కు మించకూడదని స్పష్టంచేశారు. ఎక్సైజ్‌శాఖ అనుమతించిన సమయం తర్వాత మద్యం సరఫరా చేయొద్దని ఆదేశించారు. నియమ నిబంధనలకు సంబంధించిన డిస్‌ప్లేలను అన్ని చోట్ల ఏర్పాటు చేయాలని సూచించారు. న్యూ ఇయర్‌ రోజు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి ఉంటుందని పేర్కొన్నారు.