పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
విజయనగరంజిల్లా మినహా మిగతా 12 జిల్లాలో నామినేషన్ల స్వీకరణ

Amaravati: రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు నేటి ఉదయం నోటిఫికేషన్ లు విడుదల చేశారు.. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కాగా, విజయనగరంజిల్లా మినహా మిగతా 12 జిల్లాలో తొలి విడత నామినేషన్లను అధికారులు స్వీకరిస్తున్నారు.
ఈ నెల 31 వరకూ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి దశలో మొత్తం 3,249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీన తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
జనరల్ సర్పంచ్ అభ్యర్ధులు రూ.3 వేలు, రిజర్వుడ్ సర్పంచ్ అభ్యర్ధులు రూ. 1500 డిపాజిట్ చేయాలి. జనరల్ వార్డు మెంబర్లు రూ. 1500, రిజర్వుడ్ వార్డు మెంబర్లు రూ. 500 డిపాజిట్ చేయాలి. ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎస్ఈసీ గడువు విధించింది.
ఫిబ్రవరి 9వతేదీ ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాలు వెల్లడిస్తారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/