కొత్త రేషన్ కార్డులపై కసరత్తు మొదలు

కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై పౌర సరఫరాల శాఖ కసరత్తు మొదలుపెట్టింది. గతంలోని నిబంధనలు ఎలా ఉన్నా ఈసారి మాత్రం పటిష్టంగా పరిశీలించిన తర్వాతనే కొత్త కార్డులను మంజూరు చేయాలని చూస్తుంది. అందుకు గాను అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అధికాదాయ వర్గాలను వైట్ రేషన్ కార్డు పరిధి నుంచి మినహాయించేలా కొన్ని సవరణలకు సిద్ధమవుతున్నది.

ఇందుకోసం దరఖాస్తు చేసే సమయంలోనే స్క్రూటినీ జరిగేలా సాప్ట్‌వేర్‌లో సైతం మార్పులు చేయడానికి ఏర్పాట్లు మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్) అధికారులకు లేఖ రాసిన స్టేట్ సివిల్ సప్లైస్ డిపార్టుమెంటు ఆధార్ కార్డు, పాన్ నంబర్‌ను అనుసంధానం చేసేలా సూచనలు చేసినట్లు ఆ శాఖ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానున్నది.

కొత్త రేషను కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు ‘మీ సేవ’ కేంద్రాలను ఆశ్రయిస్తున్నందున వారు వాడే సాఫ్ట్‌వేర్‌లో సైతం ఈ తరహా మార్పులు చేయాలని సివిల్ సప్లైస్ డిపార్టుమెంటు భావిస్తున్నది. దరఖాస్తు దశలోనే అందులో పేర్కొన్న కుటుంబ వివరాల ఆధారంగా అర్హత ఉన్నదీ లేనిదీ ఫిల్టర్ చేయాలని అనుకుంటున్నది. నిర్దిష్టమైన నిబంధనలు రూపొందిన తర్వాత వాటికి అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరిగితే ఆదాయ పరిమితి, భూముల వివరాలు, ఆదాయపు పన్ను చెల్లింపు తదితరాలన్నీ తెలిసిపోతాయని, అర్హత ఉన్నదో లేదో అక్కడే తెలిసిపోతుందని సివిల్ సప్లైస్ వర్గాలు పేర్కొన్నాయి.