కాషాయం కండువా కప్పుకోబోతున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపినట్టుగా సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లోనే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన బీజేపీ అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ బీజేపీలో ఆయన యాక్టివ్ రోల్ పోషించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. మరోవైపు ఆయనకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే వాదన కూడా ఉంది.

తెలంగాణలో క్రమంగా బలం పెంచుకుని.. దూకుడుగా ముందుకు వెళ్తోన్న బీజేపీ పార్టీ.. ఎన్నికల ముందు చేరికల పర్వానికి తెర తీసింది. ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీలో చేరగా.. ఇక ఇప్పుడు కిరణ్ కుమార్ ను సైతం పార్టీలోకి ఆహ్వానిస్తుంది. 2014లో కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఆయన సమైక్యాంధ్ర పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. కానీ 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఆ తర్వాత కిరణ్‌ కుమార్‌ రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి.. మళ్లీ పొలిటికల్‌గా యాక్టీవ్‌ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.