టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి నేటితో శుభంకార్డు

తెలంగాణ లోని టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచార గడువు శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనున్నది. ఈ నెల 13 న ఎన్నిక జరగనుంది. ఎన్నిక బరిలో ఉన్న 21 మంది అభ్యర్థులు 10 రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. టీచర్ల ఇంటింటికి వెళ్లి తమను గెలిపించాలని వేడుకొన్నారు. సాయంత్రం వేళ విందు సమావేశాలతో ఓటర్లను కొత్త హామీలతో ఆకట్టుకొనే ప్రయత్నాలు చేసారు. ఎన్నికల బరిలో మొత్తం 21 మంది ఉండగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ అభ్యర్థిగా ఏవీఎన్​రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి పీఆర్టీయూటీ తరఫున పోటీ చేస్తుండగా, పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి, యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి, ఎస్టీయూ అభ్యర్థి భుజంగరావు, టీపీటీఎఫ్​ అభ్యర్థి వినయ బాబు, బీసీటీఏ అభ్యర్థి విజయ్ కుమార్, సంతోష్ ​కుమార్ తదితరులు బరిలో ఉన్నారు. అయితే, ప్రధానమైన పోటీ మాత్రం ఐదారుగురి మధ్యలోనే ఉండనుంది.

అలాగే ఎన్నికకు 137 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు అధికారులు. మహబూబ్‌నగర్‌లో 15 పోలింగ్‌ స్టేషన్లు, నాగర్‌ కర్నూల్‌ 14, వనపర్తి 7, జోగులాంబ గద్వాల 11, నారాయణపేట్‌ 5, రంగారెడ్డి 31, వికారాబాద్‌ 18, మేడ్చల్‌ మలాజిగిరి 14, హైదరాబాద్‌ జిల్లాలో 22 పోలింగ్‌ స్టేషన్లను సిద్ధం చేసినట్టు వివరించారు. మొత్తం 29,720 ఓటర్లుండగా, అందులో 15,472 మంది పురుషులు, 14,246 మంది స్త్రీలు, ఇతరులు 2 ఓట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.