దేశానికి ఓబీసీ ప్రధానిని, గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసింది బిజెపియేః ఈటల

బిఆర్ఎస్‌లో ఇతర రాష్ట్రాల్లోనూ కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ఇంచార్జులుగా ఉంటారని విమర్శ

etela-rajender-accuses-brs-for-party-chief-and-cm-posts

హైదరాబాద్‌ః దేశానికి ఓబీసీ ప్రధానిని అందించింది, గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసింది బిజెపియేనని, కానీ తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకు కల్వకుంట్ల కుటుంబంలోని వ్యక్తే సీఎం అవుతారని, మరొకరికి ఆ అవకాశం ఉండదని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బిజెపి నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆయన హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పార్టీ అధ్యక్ష పదవుల్లోనూ కెసిఆర్ కుటుంబ సభ్యులే ఉంటారన్నారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మాత్రం 70 శాతం మందికి కేంద్ర కేబినెట్లో చోటు కల్పించిందన్నారు.

ఇతర రాష్ట్రాల బిఆర్ఎస్ ఇంచార్జులు కూడా కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ఉంటారన్నారు. ఇతర వర్గానికి లేదా ఇతర కుటుంబాలకు ఎక్కడా అవకాశం దొరకదని విమర్శించారు. తెలంగాణ వస్తే బడుగులకు అధికారం, జీవితాల్లో వెలుగు వస్తుందని చెప్పారు కానీ కెసిఆర్ కుటుంబంలో మాత్రమే వచ్చిందన్నారు. పదవులు వచ్చింది కూడా వారి కుటుంబానికే అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రజల బతుకులు ఆగమయ్యాయని, రాజ్యాధికారంలో భాగం ఇస్తామని ఎస్సీలను మోసం చేశారన్నారు. బీసీల పట్ల చులకనభావంతో ఉన్నారన్నారు.

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారని డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తామని కెసిఆర్ మోసం చేశారన్నారు. బిజెపి మొదటి నుంచి బీసీలకు ప్రాధాన్యత ఇస్తోందని, బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిందన్నారు. కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అవినీతిరహిత తెలంగాణ కోసం బిజెపికి మద్దతివ్వాలన్నారు.