ఢిల్లీలో ఎన్‌కౌంట‌ర్.. ముగ్గురు అరెస్టు

Encounter in Delhi.. Police arrests three Hashim Baba gang members

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో సోమ‌వారం అర్ధ‌రాత్రి దాటాక జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ క‌ల‌క‌లం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు గ్యాంగ్‌స్ట‌ర్ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎదురుకాల్పుల్లో గాయ‌ప‌డ్డ గ్యాంగ్‌స్ట‌ర్ల‌కు ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈశాన్య ఢిల్లీలోని అంబేద్క‌ర్ కాలేజీ స‌మీపంలో అర్ధ‌రాత్రి 1:30 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు పోలీసుల‌కు సైతం స్వ‌ల్ప గాయాల‌య్యాయి.

హాశిమ్ ముఠాకు చెందిన ముగ్గురు స‌భ్యులు మార్చి 9న అర్బాజ్ అనే వ్య‌క్తిని కాల్చిచంపారు. ఈ గ్యాంగ్‌స్ట‌ర్ల క‌ద‌లిక‌ల‌పై పోలీసుల‌కు సోమ‌వారం స‌మాచారం అందింది. దీంతో వారిని ప‌ట్టుకునేందుకు వెళ్ల‌గా, గ్యాంగ్‌స్ట‌ర్లు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ క్ర‌మంలో దుండ‌గుల కాళ్ల‌కు గాయాల‌య్యాయి. వెంట‌నే వారిని ప‌ట్టుకొని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. హ‌త్య‌, హ‌త్యాయ‌త్నం కింద కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేప‌ట్టారు.