ఆవేశం మిగిలేను ఆవేదనగా ..

sad
Emotional feelings

బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్‌ మహిళ కోపంతో కన్న తల్లినే హతమార్చింది. తర్వాత ప్రియుడితో పారిపోయింది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరగడంతో భర్త రెచ్చిపోయి, భార్యను వంటింట్లో వ్ఞండే కత్తితో పొడిచి హతమార్చాడు. తల్లికొడుకుల మధ్య చిన్న గొడవ జరగడంతో కొడుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు. కొడుకు వెళ్లిపోయాడని మనస్తాపంతో తల్లి ఆత్మహత్యకు పాల్పండింది. ఇలాంటి వార్తలు ప్రతిరోజు పదులసంఖ్యలో జరుగుతున్నాయి.

కోపం, ఆవేశం, ఆగ్రహం ఇవన్నీ సున్నితమైన మానవ అనుబంధాలను దెబ్బతీస్తున్నవే. అందుకే ఆవేశం అదుపులో ఉంచుకోవడం ప్రతిఒక్యరూ అభ్యాసం చేయాల్సిందే. లేకపోతే దాని ప్రతిఫలాన్ని మనమే అనుభవించాలి. నాకు కోపం వస్తే మనిషికాను, నాజోలికి రావద్దు, ఆవేశం వస్తే నేను ఎలా ప్రవర్తిస్తానో నాకు తెలియదు, నన్ను అనవసరంగా రెచ్చగొట్ట కు అని గొప్పగా తమకున్న కోపాన్ని, ఆవేశాన్ని చెప్పుకుంటుంటారు. అది తమకు అదనపు సర్టిఫికెట్‌గా భావిస్తారు. ఇది చెడ్డ అలవాటు అని గ్రహించ లేరు.

దీన్ని వల్ల నష్టం నాకు, నా కుటుంబానికే కదా అనే వివేచన ఉండదు. అరవై ఏళ్ళు పైబడిన సత్యనారాయణకు అవేశం వస్తే ఆరేళ్ళ కుర్రాడిలా ప్రవర్తిస్తాడు. అరచి గీపెడుతాడు. అందిన వస్తువులు విసిరి కొడతాడు. అడ్డువచ్చిన వాళ్ళను తిడతాడు. ఆ విధంగా అరగంట సేపు ఆర్భాటం చేశాక ఆయాసంతో అలసిపోయి, కుర్చీలో కూలబడుతాడు. తన ఉద్రేక తాపాన్ని విముక్తం చేసుకొని ఉపశమనం పొందేందుకు అతడు ఎంచుకొన్న అయోగ్య మార్గం ఇది.
పవన్‌కు ఎప్పుడు కోపం వస్తుందో, ఎవరికీ తెలియదు.

ఎవరితో గొడవపడి ఏ సమస్యతో ఇంటికి వస్తాడో అని ఇంట్లో వాళ్ళకు ఎడతెగని భయం. ఆగ్రహానికి లోనైన క్షణం హస్త సామర్థ్యం చూపడం అతని విధానం. ఎవరినో ఒకరిని కొట్టడం, కొట్టించుకోవడం, చిరిగిన బట్టలతో, చెదిరిన జుట్టుతో ఇల్లు చేరి తన గదిలో ఏకాంతంగా కూర్చోవడం అతని నిత్యకృత్యం. ఆవేశ విసర్జనకు అతడెంచుకొన్న అవివేక పద్ధతి ఇది. వీరభద్ర పద్ధతి వేరు. కోపం వస్తే క్షణకాలం కళ్ళు మూసుకొంటాడు.

తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ తల అడ్డంగా ఆడిస్తాడు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆవేశ తీవ్రత తగ్గించుకొనేందుకు అతడు అనేక యోగ్యమైన మార్గాలు అనుసరిస్తాడు. పార్కులోకి వెళ్ళి గంటసేపు నడిచి రావడం లేక సోఫాలో కూర్చోని కాసేపు శాస్త్రీయ సంగీతం వినడం లేదా మంచి పుస్తకం తీసుకొని పఠనంలో నిమగ్నం కావడం, ఇవీ వీరభద్ర పాటించే ప్రశంసనీయ పద్ధతులు. విశాలాక్షి సన్నితమైన మనసు. తన మనసు బాధపడేలా భర్త మాట్లాడినప్పుడు ఆమె ఆవేదనకు లోనవుతుంది.

దు:ఖావేశం ఆమెలో కట్టలు తెంచుకొంటుంది. ఆ సమయంలో ఆమె ఎవరినీ పళ్ళెత్తు మాట అనదు. పక్కకాలనీలోని అనాథాశ్రమం చేరుకొంటుంది. అక్కడున్న బాలబాలికలతో ఆహ్లాదంగా అరగంట సేపు కాలక్షేపం చేస్తుంది. ఈ విధానంగా ఆమె ఉద్వేగ తాపోగ్రతను తగ్గించుకొంటుంది.
ఉద్వేగ తాపోగ్రతను మనం వివిధ మార్గాలలో విసర్జితం చేసుకోవచ్చు. అవివేకంతో ఆవేశాలను ప్రదర్శించి దుష్పరిణామాలు కొని తెచ్చుకోవచ్చు. మానవ సంబంధాలు చెడగొట్టుకొని మనశ్శాంతి కోల్పోవచ్చు. లేదా విజ్ఞతతో నిగ్రహం పాటించి, వ్యాయామం ద్వారానో, ధ్యానం ద్వారానో లేక గ్రంథ పఠనం, సంగీత శ్రావణం, సమాజ సేవ వంటి సన్మార్గాల ద్వారానో ఒత్తిడి తీవ్రతను తగ్గించుకోవచ్చు. ప్రశాంతత చేకూర్చుకోవచ్చు.

కారుకు షాక్‌ అబ్సార్బర్లు ఉంటాయి. రోడ్డుకుదుపుల ఘాతాలను అవి సంగ్రహించు కొంటాయి, కారుకు నష్టం వాటిల్లకుండా కాపాడతాయి. అదేరీతిలో జీవిత ప్రయాణంలో మనకు కష్టం కలిగించేవి, నష్టం వాటిల్లజేసేవి అనేక సంఘటనలు ఎదురవుతుంటాయి. మనలను ఆవేశాలకు గురి చేస్తుంటాయి. అవి మన బతుకులను భగ్నం చేయకుండా, మన ప్రగతికి విఘాతం కలిగించకుండా చూసుకోవడం మన కర్తవ్యం. మన ఆవేశతీవ్రతను సంగ్రహించి మనసును నిశ్చలంగా ఉంచేందుకు ఉపయోగపడే షాక్‌ అబ్సార్బుర్లు మన బుర్రల్లో మనం ఏర్పాటు చేసుకోవడం అవసరం.

అటువంటి షాక్‌ అబ్సార్బర్స్‌ మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ, మనం జీర్ణించుకోవలసిన జీవిత తత్త్వం . జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదనీ, ఆటుపోట్లు అనివార్యమనీ అర్థం చేసుకోవాలి. మనకు అప్రియమైన వాళ్ళు ఎందరో ఉంటారు. అయిష్టమైన విషయాలు అనేకం ఉంటాయి. ఈ భూమండలం మన ఒక్కరి కోసం సృష్టంచబడలేదనీ, సహనం ప్రదర్శించి సహజీవనం సాగించడం చాలా అవసరమనీ మనం హేతుబద్ధంగా ఆలోచించాలి.

మన సమర్థ్ధతకు, స్థోమతకు మించిన ఆశలతో ఆకాశానికి నిచ్చెనలు వేయడం ఆపేసి, సమకూరిన వాటితో సంతృప్తిపడడం అభ్యాసం చేసుకోవాలి. రెండవ షాక్‌ అబ్సార్బర్‌ మన మానసిక ప్రవృతి. ప్రతి విషయాన్నీ తీవ్రంగా తీసుకోవడం మానుకోవాలి. హాస్యప్రవృతి అభివృద్ధి చేసుకోవాలి. కొందరీ చేష్టలను, కొన్ని విషయాలను తేలిగ్గా తీసుకొని చిరునవ్వుతో సరిపెట్టుకోవడం స్వభావంగా సంతరించుకోవాలి. హాస్యాన్ని ఆనందించడం, హాయిగా నవ్వేయడం అలవాటు చేసుకొంటే ఆవేశం తగ్గుతుంది. మనసు తేలిక పడుతుంది.

ఇక మూడవ షాక్‌ అబ్సార్బర్‌ నిరాశకు తట్టుకొనే సహన శీలత జీవితంలో మనం అశించినవన్నీ నెరవేరవు. కోరుకొన్నవన్నీ సమకూరవు. మనుషులందరూ మన అభీష్టం మేరకు నడుచుకోరు. పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉండవు. ప్రతికూల పరిస్థితులలో నిరాశకు, నిస్పృహకు, విరక్తికి, వ్యాకులతకు లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు సహనశీలత చాల అవసరం. జీవితంలో తగిలే దెబ్బలకు తట్టుకొంటూ నిబ్బరం కోల్పోకుండా వ్యవహరిస్తే జీవితం విజయవంతంగా గడుస్తుంది.

‘యద్భావం తద్భవతి అన్నది లోకోక్తి. మన బుర్ర నిండా ఎటువంటి భావనలు నింపుకొంటే మన జీవితం అదే విధంగా జరుగుతుంది. హానికర స్వభావాలను, నెగటివ్‌ ఆవేశాలను ఎంతమేరకు అరికట్టుకొంటే మన బతుకు అంత మేరకు బాగుపడుతుంది. సమాజ జీవితంలో సమయం సందర్భాన్ని బట్టి మనలో కొన్ని నెగటివ్‌ ఎమోషన్స్‌ వివిధ మోతాదుల్లో ఉత్పన్నమవుతుంటాయి.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/