వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల పందెం కట్టి ఆత్మహత్య ..

ఏపీ ఎన్నికల సందర్బంగా పెద్ద ఎత్తున పందేలు జరిగిన సంగతి తెలిసిందే. మాములుగా సంక్రాంతి సమయంలో , IPL సీజన్ లో పెద్ద ఎత్తున పందేలు జరుగుతుంటాయి. కానీ ఈసారి ఏపీ ఎన్నికల సందర్బంగా వందల కోట్లు చేతులు మారాయి. ముఖ్యంగా కూటమి ఫై పెద్ద ఎత్తున పందేలు కాయగా..మరికొంతమంది వైసీపీ ఫై పందేలు కసి చేతులు కాల్చుకున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లిలో ఓ వ్యక్తి వైసీపీ గెలుస్తుందని ఏకంగా రూ.30 కోట్లు పందెం కట్టి..చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.

గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాలరెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడు. భార్య సర్పంచి. వీరు వైసీపీ మద్దతుదారులు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని వేణుగోపాల రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో సుమారు రూ.30 కోట్ల వరకు పందెం వేశారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజు ఊరు విడిచి వెళ్లారు. పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో ఇంటికి తిరిగి రాలేదు. పందెం వేసిన వారు ఫోన్లు చేసినా స్పందించకపోవడం, గ్రామంలో లేకపోవడంతో ఈ నెల 7న పందెం వేసినవారు ఆయన ఇంటికెళ్లి తలుపులు పగులగొట్టి ఏసీలు, సోఫాలు, మంచాలు తదితర వస్తువులు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఊళ్లోకి వచ్చిన ఆయన విషయం తెలిసి మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆదివారం పొలం వద్ద పురుగు మందు తాగారు. మృతదేహం వద్ద ఓ లేఖను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా తన భర్త మానసికంగా ఇబ్బంది పడుతున్నారని మృతిడి భార్య తెలిపింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.