రౌడీ గ్యాంగ్ కాల్పులు..8 మంది పోలీసుల మృతి
క్రిమినల్ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు

లఖ్‌నవూ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. రౌడీషీటర్ వికాస్ దూబే ముఠా జరిపిన కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. వికాశ్ దూబే గ్యాంగ్‌ను పట్టుకునేందుకు నిన్న రాత్రి 16 మంది పోలీసుల బృందం వెళ్లింది. వారి రాకను గమనించిన దూబే ముఠా భవనం పైనుంచి కాల్పులు జరిపింది. ఈ ఘటనలో డీఎస్పీ దేవేంద్ర మిశ్రాతోపాటు ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల అనంతరం ముఠా సభ్యులు పరారయ్యారు. వికాశ్ ముఠా జరిపిన కాల్పుల్లో గాయపడిన మరో నలుగురు పోలీసులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ, ఐజీ, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పరారీలో ఉన్న క్రిమినల్ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. పోలీసుల మృతికి స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. దూబే ముఠాను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ హెచ్‌సీ అవస్థిని ఆదేశించారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/