మాటలతో ధరలు తగ్గవు

పటిష్టమైన ప్రణాళిక అవసరం

Rising market prices
Rising market prices

పెరుగుతున్న ధరలపై ఉక్కుపాదం మోపుతాం, నల్లబజారు వ్యాపారులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్న పాలకుల తీరుపై సామాన్యులు సైతం ముక్కున వేలు వేసుకుంటున్నారు.

ఇప్పుడే కాదు అధికారంలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా ధరలు పెరగడం, వాటిని నియంత్రిస్తామని చెప్పడం అక్రమ నిల్వలు చేసేవారిపై చర్యలు తీసుకొని జైళ్లకు పంపుతామని బెదిరించడం రివాజుగా మారిపోయింది.

అలాగే ప్రతిపక్షంలో ఉన్న వారు ధరల పెరుగుదలపై ఉద్యమాలు చేపట్టడం, తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వరం మార్చడం మామూలుగా మారిపోయింది. ఈ విషయంలో ఎప్పుడూ చర్యలు తీసుకోవడం లేదని చెప్పడం లేదు.

రకరకాల చట్టాలు తెచ్చారు. బ్లాక్‌ మార్కెటీర్లను జైళ్లకు పంపారు. ప్రభుత్వమన్నా, అందులో పనిచేసే అధికారులన్నా అక్రమార్కులు గడగడలాడిన సందర్భాలు ఉన్నాయి.

కానీ రానురాను పరిస్థితులు మారిపోతున్నాయి. దళారుల ఆధిపత్యమే ఏదో రకంగా కొనసాగే పరిస్థితులు నెలకొన్నాయి.

నల్లబజారు వ్యాపారులు తమను ఇబ్బందులు పెట్టే అధికారులను శంకరగిరి మాన్యాలకు పట్టించిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

అందుకే పాలకుల అరుపులు తప్ప చర్యలు నామమాత్రంగా మిగిలిపోతున్నాయనే విమర్శలకు జరుగుతున్న సంఘటనలు అద్దంపడుతున్నాయి.

హెచ్చరికలు తప్ప ఆచరణలో లేకుండాపోతున్నది. గతంలో ఉన్న భయభక్తులు నేడు కన్పించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తున్న కొందరు పెద్దలనేది అందరికి తెలిసిన విషయమే.

కేవలం రాజకీయాలే ఏకైక వ్యాపకంగా జీవనం సాగించే నేతలు కనుమరగైపోయారు.

రాజకీయాలను కూడా వ్యాపారంగా మార్చి సంపాదన కోసం కొందరు రాజకీయాల్లో ప్రవేశిస్తుంటే మరికొందరు తాము వివిధమార్గాల ద్వారా కూడబెట్టుకొన్న సంపదను కాపాడుకొనేందుకు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు.

ఫలితంగా వ్యాపారాల్లో జరుగుతున్న అవకతవకలను, పెరుగుతున్న ధరలను అదుపు చేయలేకపోతున్నారనే వాదనను తోసిపుచ్చలేం. మానవ ఆరోగ్యాన్ని పట్టిపీడిస్తున్న కల్తీని ఏమాత్రం నియంత్రంచలేకపోతున్నారు.

కల్తీ అనేది అతి భయంకరంగా తయారౌతున్నది. ఇందుగలడందు లేడన్నట్లు కల్తీ పొగమంచులా అంతటా విస్తరించింది, విస్తరిస్తూనే ఉంది.

ఇక ధరల పరిస్ధితి ఇందుకు భిన్నంగా లేదు. ఈ రోజు ఉన్న ధర రేపు ఉండదు, రేపు ఉన్న ధర ఆ మరసటి రోజు ఉండదు. ఎందుకు పెరుగు తుందో సామాన్యులకు అంతుబట్టదు. తెలుసుకోవాలని ప్రయత్నించినా చెప్పేవారుండరు.

పెట్రోల్‌, డిజల్‌ ధరలే ఉదాహరణగా తీసుకొన్నా అంతా ఒక మిథ్యగా ఉంటుంది. అంతర్జాతీయంగా ముడి సరుకులు ధరలను బట్టి వీటి ధరలు నిర్ణయం చేస్తారంటారు.

పెట్రోల్‌, డీజల్‌ను తయారు చేసే ముడి సరుకులు పెరిగినప్పుడు ఇక్కడ పెంచుతారు. అక్కడ తగ్గినప్పుడు తగ్గించాలి.

కానీ కరోనా కాలంలో అక్కడ ముడిసరుకుల ధర బాగా తగ్గిపోయింది. కానీ ఇక్కడ భారీగా పెంచుకొంటూ పోతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వమే కాదు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుపాత్ర పోషిస్తున్నాయి.

ఆదాయం కోసమే పెంచుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఇవి పెరగడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాదిమందిపై భారం పడుతుంది.

కోట్లాది మంది వాహనదార్లపైనే కాదు వ్యవసాయ, రవాణా రంగాలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. వ్యయసాయరంగంలో యాంత్రీకరణ పెరిగిపోయింది.

ఇంకా పెంచే దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నారు. వాస్తవంగా చూస్తే అమెరికా లాంటి దేశాలతో పోలీస్తే మనం చాలా వెనుకబడి ఉన్నాం. యాంత్రీకరణవైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అందులో సందేహం లేదు.

కానీ ఇప్పటికే పెట్టుబడులు పెరిగి గిట్టుబాటుకాకనే నష్టాల ఊబిలో వ్యవసాయరంగం కూరుకుపోతున్నది.

ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధర కోసం పెంచితే దానితో పాటు పాలకులు వేసే పన్నులు, దళారుల కమీషన్లు అన్నీ కలిపి వినియోగదారుని పై మోయలేనిభారం పడకతప్పదు.

దీనికితోడు దళారుల ఆగడాలను, మోసాలను నివారించడంలో విఫలం కావడం కూడా ధరలు అదుపు లేకుండా పెరగడానికి కారణాలనే వాదనను తోసిపుచ్చలేం.

రైతుల వద్ద ఉత్పత్తులు ఉన్నప్పుడు ధరలు పాతాళలోకంలో ఉంటాయి. అదే పంటలు రైతుల గడపదాటి దళారుల గోదాముల్లోకి చేరుకోగానే అంచనాకు అందకుండా పెరిగిపోతున్నాయి.

ఇది ఇప్పటికిప్పుడు ప్రారంభం కాకపోయినా ఏనాటి నుంచో కొనసాగుతున్నా నియంత్రంచలేకపోతున్నారు.

రైతులు దగాకు గురికాకుండా వారి ఉత్పత్తులకు సరైన ధరలు ఇప్పించే లక్ష్యంతో ఏర్పాటు అయిన మార్కెట్‌ కమిటీలు చాలా చోట్ల దళారుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో మార్కెట్‌కమిటీ కార్యాలయం ఆవరణలో రైతులు నిరసనలు,ధర్నాలు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

ఉత్పత్తిదారునికి లభిస్తున్న, వినియోగ దారుడు చెల్లిస్తున్న ధరలు ఏ వస్తువ్ఞ విషయంలో పరిశీలించినా వ్యత్యాసం దేశవ్యాప్తంగా చూస్తే వేలాది కోట్లరూపాయల్లో ఉంటుంది.

ధరల నియంత్రణ విష యంలో పాలకులు పటిష్టమైన ప్రణాళిక రూపొందించ డమే కాదు అమలుకు త్రికరశుద్ధిగా ప్రయత్నించాలి.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/