జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఈడీ

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది. రూ. 22 కోట్ల ఆస్తులు అటాచ్ చేయడం జరిగింది. బీఎస్ 3 వాహనాల కుంభకోణం కేసులో ప్రభాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బీఎస్ 3 వాహనాలను నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి బీఎస్ 4గా మార్చినట్టు ఈడీ గుర్తించింది. నాగలాండ్, కర్నాటక, ఏపీలో రిజిస్ట్రేషన్స్ జరిగినట్టు గుర్తించింది.

ఇప్పటికే బస్సుల కొనుగోలు వ్యవహారంలో ఈడీ విచారణకు జేసీ ప్రభాకర్ రెడ్డి పలు మార్లు హాజరయ్యారు. ఈడీ అధికారులు కోరిన సమాచారం అందించారు. బస్సుల కొనుగోలు వ్యవహారంలో అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారంటూ ఈడీ అభియోగాలు మోపింది. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటుగా గోపాల్ రెడ్డికి చెందిన రూ 22.10 కోట్ల మేర ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..ఈడీ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.

జేసీ ట్రావెల్స్ వాహనాల కొనుగోలులో అవకతవకలు, ఫోర్జరీ పత్రాలను సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారని ఈడీ అభియోగాలు మోపింది. ఇదే కేసుకు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డిని గత నెలలో ఈడీ సుదీర్ఘంగా విచారించింది. రెండు రోజుల పాటు ప్రభాకర్ రెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. బస్సుల అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించెందెవరు..ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో ఆరా తీసారు. అప్పటికే జేసీ బ్రదర్స్ నివాసాల్లో ఈడీ సోదాలు చేసింది. జేసీ బ్రదర్స్ ఎప్పటి నుంచో బస్సుల వ్యాపారంలో కొనసాగుతున్నారు.