బాసర విద్యార్థుల కీలక నిర్ణయం : 24 గంటల నిరసన దీక్షకు పిలుపు

బాసర విద్యార్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ..ప్రభుత్వం దిగిరావడం లేదు. ఈ తరుణంలో విద్యార్థుల కీలక నిర్ణయం తీసుకున్నారు. 24 గంటల నిరసన దీక్షకు పిలుపు నిచ్చారు. రాత్రంతా బయటే ఉండి నిరసనను తెలియజేయాలని నిర్ణయించారు. మా 12 డిమాండ్లను సాధించుకునే వరకు పోరాడతాం. వర్షం వచ్చినా, ఉరుములు, మెరుపులొచ్చినా తగ్గేది లేదని నిరసన తెలుపుతున్నారు. ఐదు రోజుల నుంచి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన తెలియజేసారు. కానీ ఈరోజు రాత్రంతా నిరసన దీక్ష చేస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో అన్ని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. విద్యార్థులను శాంతింపజేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం బాసర ట్రిపుల్ ఐటీ ఏవోపై వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆందోళన నేపథ్యంలో నిన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో చర్చించారు. అయితే చర్చలు సఫలం అయ్యాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొనగా, చర్చలు విఫలం అయ్యాయని విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 2018 నుండి తమ డిమాండ్లను ప్రభుత్వం నాన్చుతూ వస్తుందని విద్యార్థులు ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ తమ డిమాండ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామంటున్నారు విద్యార్థులు.