యంగ్ ఇండియన్ ఆఫీసుకు సీల్ చేసిన ఈడీ

ED seals Young Indian office in National Herald premises

కాంగ్రెస్ పార్టీ ప‌త్రిక నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని నేష‌న‌ల్ హెరాల్డ్ కార్యాల‌యాల‌తో పాటు కోల్‌క‌తాలోని ఆ ప‌త్రిక కార్యాల‌యాల్లో మంగ‌ళ‌వారం నుంచి సోదాలు చేసిన ఈడీ… బుధ‌వారం సోదాల‌ను ముగించిన‌ట్లు తెలిపింది. అదే స‌మ‌యంలో ఢిల్లీలోని నేష‌న‌ల్ హెరాల్డ్ ప్ర‌ధాన కార్యాల‌యంలోనే న‌డుస్తున్న యంగ్ ఇండియా కార్యాల‌యాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. తమ అనుమతి లేనిదే ఆఫీస్ ఓపెన్ చేయొద్దని ఆదేశించింది.

ఈడీ తీసుకున్న ఈ చ‌ర్య‌తో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం (ఏఐసీసీ) ప‌రిస‌రాల్లో భారీగా పోలీసులు మోహ‌రించారు. ఫ‌లితంగా ఏఐసీసీ కార్యాల‌యానికి వెళ్లే దారుల‌న్నీ మూసుకుపోయాయి. అదే స‌మ‌యంలో యంగ్ ఇండియా ప్ర‌మోట‌ర్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నివాసం వ‌ద్ద కూడా పెద్ద సంఖ్య‌లో పోలీసు బ‌ల‌గాలు మోహ‌రించాయి. ఈడీ రెయిడ్స్‌‌ పేరుతో కక్ష సాధింపునకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. దేశంలోని ప్రధాన ప్రతిపక్షంపై జరుగుతున్న నిరంతర దాడుల్లో భాగమే ఈ చర్య అని మండిపడింది. ‘‘మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారు. ఈ చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మమ్మల్ని మౌనంగా ఉంచలేరు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. అసలు ఈ కేసులో నగదు లావాదేవీలే జరగనప్పుడు.. మనీ ల్యాండరింగ్ ఎలా జరుగుతుందని రాజస్థాన్ సీఎం గెహ్లాట్ ప్రశ్నించారు.