ఆ సాక్ష్యాలకు సీబీఐ వాళ్లు గట్టి భద్రతను ఏర్పాటు చేయాలి : బుద్ధా

జాబ్ మేళా పేరుతో జగన్నాటకానికి తెర తీశారని విమర్శ

అమరావతి: మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టు నుంచి దొంగిలించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. కోర్టులో ఉన్న సాక్ష్యాలను దొంగిలించడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కేసుల్లో కూడా సాక్ష్యాలను ఎత్తుకెళ్లే ప్రమాదం ఉందని… ఆ సాక్ష్యాలకు సీబీఐ వాళ్లు గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని అన్నారు. మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులోని ఆధారాలకు కూడా భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై కూడా బుద్ధా వెంకన్న మండిపడ్డారు. వైస్సార్సీపీ కుల పార్టీనా? టీడీపీ కుల పార్టీనా? అనే విషయం తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రకు నిన్ను జగన్ ఇన్ఛార్జీని చేశారని, తనను చంద్రబాబు ఇన్ఛార్జీని చేశారని… ఎవరిది కుల పార్టీ అని ప్రశ్నించారు. కులాన్ని చూసుకున్నది ఎవరని అడిగారు. జగన్ అవినీతిలో భాగస్వామివని, ఆయనతో కలిసి జైలుకు వెళ్లావని, అందుకే నీకు రాజ్యసభ సీటు ఇచ్చారని ఎద్దేవా చేశారు. జగన్ వచ్చాక ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయాయని… ఇప్పుడు జాబ్ మేళా పేరుతో జగన్నాటకానికి తెర తీశారని విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/