నన్ను రెచ్చగొట్టొద్దు రేవంత్ రెడ్డి – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నన్ను రెచ్చగొట్టొద్దు రేవంత్ రెడ్డి అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ నేమ్ పై రేవంత్ చేసిన వ్యాఖ్య పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే ఆయన పేరు పెట్టి మాట్లాడాలి కానీ.. మీరు అని మాట్లాడటం సరికాదన్నారు. రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారంపై తాను స్పందించేది లేద‌ని స్పష్టం చేశారు. ఈ వ్య‌వ‌హారంలో ఏది ఉన్నా రాజ‌గోపాల్ రెడ్డినే అడ‌గాలంటూ మీడియాకు తెలిపారు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. రాజ‌గోపాల్ రెడ్డి త‌న‌కు ఇష్ట‌మున్న పార్టీలోకి వెళ్లిపోయార‌న్నారు. కాంగ్రెస్ ఆర్తి కోసం తాను 34 ఏళ్ల నుంచి కష్టపడుతున్నానని వెంకట్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం రక్తం దారపోశానని .. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ నిజాయితీతో ఉన్న వాళ్లమే అని తెలిపారు. తన మీద మాట పడితే పడనని వెంకట్ రెడ్డి అన్నారు. తాము చదువుకున్న తరువాత సొంతంగా కాంట్రాక్టులు చేసుకుని పైకొచ్చామని.. ఎవరినీ మోసం చేయలేదని స్పష్టం చేశారు. రేవంత్ కామెంట్స్ తనను బాధించాయన్న ఆయన..రేవంత్ కామెంట్స్ పై ప్రజలు బాధ పడుతున్నారని అన్నారు.

అసలు నిన్న రేవంత్ రెడ్డి ఏమన్నారనేది చూస్తే..కాంగ్రెస్ కోమటిరెడ్డి కుటుంబానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పదవులు ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా పార్టీ పదవులు ఇచ్చింది. అవన్నీ మర్చిపోయి బ్రాండ్ బ్రాండ్ అని ఎగురుతున్నారు. కాంగ్రెస్ ఆదరించకపోతే బ్రాందీ షాపుల్లో పని చేయడానికి కూడా పనికిరారని రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటన అనంతరం కామెంట్స్ చేసారు.