వైసీపీ ఎమ్మెల్యే ఫై కేసు నమోదు చేసిన ఈడీ

నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి కి భారీ షాక్ ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) . నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)ని రూ.102 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. ఆయన డైరెక్టర్‌గా ఉన్న కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్‌ మరో రెండు సంస్థలతో కలిసి కేరళలో చేపట్టిన జాతీయ రహదారి పనులు పూర్తి కాకుండానే టోల్‌ వసూలు చేశాయన్న ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. ఈ నెల 16న హైదరాబాద్‌లోని కేఎంసీ కంపెనీలో సోదాలు చేపట్టి ఈ వ్యవహారం వెనుక కుట్రకోణం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది.

కేరళలో బీవోటీ పద్ధతిలో నిర్మించే జాతీయ రహదారి కాంట్రాక్టును కోల్‌కతాకు చెందిన భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌(బీఆర్‌ఎన్‌ఎల్‌), గురువాయూర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(జీఐపీఎల్‌) 2006లో దక్కించుకున్నాయి. వీటి నుంచి సబ్‌కాంట్రాక్టు పొందిన కేఎంసీ.. రోడ్డు డిజైన్‌, నిర్మాణం, అభివృద్ధి, ఫైనాన్స్‌, ఆపరేషన్‌తోపాటు నిర్వహణ బాధ్యత తీసుకుంది. కేఎంసీ ఎండీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో, పాలక్కాడ్‌కు చెందిన కొందరు స్వతంత్ర ఇంజనీర్లతో కలిసి కుట్రపన్ని.. రోడ్డు పూర్తి కాకుండానే పదేళ్ల పాటు టోల్‌ వసూలు చేశారు. ఈ తతంగంపై ఫిర్యాదు అందుకున్న సీబీఐ రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది.