జనసేనకు గాజు గ్లాస్ గుర్తు ఖరారు చేసిన ఈసీ

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీకి తీపి కబురు తెలిపిన ఈసీ. జనసేన పార్టీ కి గాజు గ్లాసు గుర్తును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఉత్తర్వుల ప్రతులను జనసేన లీగల్ సెల్ చైర్మన్ ఇ.సాంబశివ ప్రతాప్ మంగళగిరి కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అందజేశారు. గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై హర్షం వ్యక్తం చేసిన పవన్.. ఈసీ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. గత సార్వత్రిక ఎన్నికలతో పాటూ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ నేతలు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసిన విషయం తెలిసిందే.

జ‌న‌సేన గాజు గ్లాస్ గుర్తును గతంలో ఈసీ రద్దు చేసింది. దాంతో పవన్ పార్టీకి ఇక గుర్తు ఉండబోదని ప్రచారం కూడా జరిగింది. అయితే జనసేన పార్టీ రిక్వెస్ట్ తో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి వారికి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలకు జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేయనున్నారు. దాంతో జనసేనకు ఎన్నికల గుర్తు సమస్య తొలగిపోయింది.