తెలంగాణలో ఇండియన్ నేవీ రాడార్ స్టేషన్

ఇండియన్ నేవీకి సంబంధించిన వెరీ లో ఫ్రీక్వెన్సీ(VLF) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం వికారాబాద్(D) దామగుండం అటవీ ప్రాంతంలో 1,174 హెక్టార్ల భూమిని నేవీకి అటవీశాఖ అప్పగించింది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు దీనిని నెలకొల్పనున్నారు. దేశంలోనే ఇది రెండో రాడార్ స్టేషన్ కాగా, మొదటిది తమిళనాడులో ఉంది. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొదటిది. 1990 నుంచి అది నావికా దళానికి సేవలందిస్తోంది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ గుర్తించింది.

ఇక్కడ నేవీ స్టేషన్‌తో పాటు ఏర్పడే టౌన్‌షిప్‌లో స్కూల్స్‌, హాస్పిటల్స్‌, బ్యాంకులు, మార్కెట్లు ఉండనున్నాయి. ఈ నేవీ యూనిట్‌ దాదాపు 600 మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులు సైతం ఉంటారు. దాదాపు 2500 నుంచి 3000 మంది ఈ టౌన్‌షిప్‌లో నివసించనున్నారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కిలోమీటర్ల రోడ్డు వేయనున్నారు. 2027 నాటికి వీఎల్ఎఫ్ సెంటర్ పనులన్నీ పూర్తయి అందుబాటులోకి వస్తుంది.