మాజీ ఎమ్మెల్యే డీవై దాస్‌ ను పార్టీ నుండి సస్పెండ్ చేసిన వైస్సార్సీపీ అధిష్టానం

వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు సీఎం జగన్ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే డీ.వై.దాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు డీ.వై.దాస్‌ను సస్పెండ్‌ చేస్తూ పార్టీ అధ్యక్షులు జగన్ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ సస్పెన్షన్ వ్యవహారంపై దాస్ స్పందించారు.. వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు.

ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌ లోట్‌స్‌పాండ్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకుని పామర్రు అభ్యర్థిని గెలిపించమని కోరారని చెప్పుకొచ్చారు. తాను నియోజకవర్గంలో వైస్సార్సీపీ అభ్యర్థిని 33వేల ఓట్ల మెజార్టీతో గెలిపించామని.. నాలుగేళ్లుగా పార్టీలోనే కొనసాగుతున్నానని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ తనను ఏ కార్యక్రమానికి ఆహ్వనించలేదని.. ఈ విషయాన్ని ఇప్పటి వరకు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. తాను ఎక్కడా పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరించలేదని.. అలాంటి ఆలోచన లేదన్నారు.