పవన్ కళ్యాణ్ కు సంఘీభావం తెలిపేందుకే కలిశాను – చంద్రబాబు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో మంగళవారం (అక్టోబర్ 18) మధ్యాహ్నం ఇరువురు దాదాపు గంటన్నర పాటు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన పరిణామాలు చూసి పవన్ కళ్యాణ్ కు సంఘీభావం తెలిపేందుకే కలిశానని చంద్రబాబు అన్నారు.

పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టుకున్నరోజే ప్రభుత్వ కార్యక్రమం పెట్టడం సరికాదని చంద్రబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ వదిలి వెళ్లేవరకు ఆంక్షలు పెట్టారని , పవన్ వెళ్లే దారిలో లైట్లు కూడా తొలగించడం దారుణమన్నారు. ఒకేరోజు ఎప్పుడు రెండు పార్టీల సమావేశాలు జరగలేదన్నారు. రెండు పార్టీల నేతలు ఎదురుకాకుండా పోలీసులు చూసుకుంటారని తెలిపారు. కానీ విశాఖలో పోలీసుల తీరు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై దాడులు చేసి తిరిగి తమపైనే కేసులు పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. దాడులు చేయడం.. కేసులు పెట్టడం, జైలులో వేయడం దారుణమన్నారు. ప్రతిపక్షాలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురుతిరిగితే కేసులు, దాడులతో భయపెడుతున్నారని పేర్కొన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందన్నారు. కొందరు పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల కార్యక్రమాలపై అడుగడుగునా ఆంక్షలా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజకీయ నేతలకే రక్షణ లేదు.. ఇక ప్రజలకేం రక్షణ కల్పిస్తారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.