దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

అర్ధరాత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసి..భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున కార్యకర్తలు , నేతలు తరలివస్తున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ ని పరామర్శించడానికి వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరామర్శించడానికి వచ్చిన వాళ్లను అరెస్ట్ చేయడం ఏంటని, తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని రఘునందన్ రావు.. పోలీసులను డిమాండ్ చేసారు. రఘునందన్ రావుతో పాటు మరికొందరు మహిళా బేజేపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరోపక్క బండి సంజయ్ అరెస్ట్ ఫై బిజెపి నేతలు స్పందిస్తున్నారు. బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామిమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రోజురోజుకు తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నందుకే కల్వకుంట్ల కుటుంబం.. అరాచకంగా నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు.

బండి సంజయ్అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఒక ఎంపీనీ కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గం. కెసిఆర్ చెప్పినట్టు పోలీసులు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తప్పు దోవపట్టించడానికి నిదర్శనం బండి సంజయ్ అరెస్ట్. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. అంటూ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.