దుబాయ్​లో భారీ అగ్నిప్రమాదం.. మృతుల్లో భారతీయులు

దుబాయ్‌లోని అల్ రస్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులతో సహా మొత్తం 16 మంది సజీవదహనమయ్యారు. ఈ మంటల్లో కాలిపోయిన వారిలో కేరళ, తమిళనాడు వాసులతో పాటు పాకిస్థాన్, నైజీరియా ప్రజలు ఉన్నారు. భవన నిర్మాణంలో తగిన రక్షణ చర్యలు పాటించకపోవడంతో ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

ఈ ప్రమాదం అల్‌ రాస్‌ నగరంలోని అల్‌ ఖలీజ్‌ స్ట్రీట్‌లో గల ఐదు అంతస్తుల భవనంలో సంభవించింది. నాలుగో అంతస్తులో ఉను ఓ అపార్ట్‌మెంట్‌లో శనివారం మధ్యాహ్నం12.35 గంటలకుమంటలు ఎగసిపడగా.. దుబాయ్ సివిల్‌ డిఫెన్స్‌ బృందాలు ఎంతో శ్రమించి మధ్యాహ్నం 2.42 గంటలకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. గాయపడిన వారినిఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మృతి చెందిన వారిలో కేరళకు చెందిన దంపతులు, తమిళనాడుకు చెందిన మరో ఇద్దరు పురుషులు ఉన్నారు. రిజేష్‌ (38), అతని భార్య జిషి (32) మలప్పురం వెంగరకు చెందిన వారు కాగా.. అబ్దుల్‌ ఖాదర్‌ మరియు సలియాకుండ్‌ తమిళనాడు వాసులు. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు భారతీయ సామాజిక కార్యకర్త నసీర్‌ వాటనపల్లి అండగా నిలిస్తున్నారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘటనకు దారి తీసిందని అధికారులు ప్రాథమింగా నిర్ధారించారు.