వివేకా హత్య కేసు : అవినాష్‌రెడ్డిని నిందితుడిగా చేర్చిన సీబీఐ

వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో అవినాష్ రెడ్డిని నిందితుడిగా సీబీఐ చేర్చింది. ఎంపీ అవినాష్ రెడ్డిని తండ్రి భాస్కర్ రెడ్డిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా అవినాష్ రెడ్డిని సహనిందితుడిగా సీబీఐ చేర్చింది. దీంతో నేడు హైదరాబాద్ లో మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ ఎదుట అవినాష్ విచారణకు హాజరు కానున్నాడు.

ఇప్పటికే అవినాష్ రెడ్డిని నాలుగు సార్లు విచారించిన సీబీఐ.. ఈరోజు మరోసారి విచారించనుంది. ఇప్పటి వరకు అవినాష్ రెడ్డిని సాక్షిగానే విచారించిన సీబీఐ… తాజాగా నిందితుడిగా విచారించనుంది. ప్రస్తుతం అవినాష్ పులివెందుల నుండి హైదరాబాద్ బయలుదేరినట్లు సమాచారం. వివేకా హత్య అనంతరం సహనిందితులు డి.శివశంకర్‌రెడ్డి, టి.గంగిరెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డితో కలిసి ఆధారాల్ని ధ్వంసంచేయడంలో భాస్కర్ రెడ్డి కీలకపాత్ర పోషించారని అభియోగించింది. దీంతో మొదటిసారి అవినాష్‌ రెడ్డి పేరు నిందితుల జాబితాలో వచ్చింది.

మరొపక్కక తన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ పై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. వివేకా హత్యకు ముందు జరిగిన పరిణామాలను పూర్తిగా సీబీఐ అధికారులు పక్కన పెట్టేశారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థ ఈ స్థాయికి దిగజారడం విచారకరమన్నారు. వివేకానందా రెడ్డి స్వయంగా రాసిన లేఖను సీబీఐ అధికారులు పట్టించుకోవటం లేదని అవినాష్ రెడ్డి ఆరోపించారు. పాత అధికారుల తీరు మాదిరిగానే కొత్త అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పారు.

ఆయన మరణించిన సమయంలో పోలీసులకు తానే స్వయంగా సమాచారం ఇచ్చానని గుర్తు చేశారు. హత్య గురించి ముందుగా తెలిసింది వివేకా అల్లుడికేనన్న అవినాష్ రెడ్డి… నాకంటే గంట ముందుగానే విషయం తెలిసినా ఆయన పోలీసులకు చెప్పలేదన్నారు. సమాచారం దాచిన వివేకా అల్లుడిని విచారించటం లేదని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు.