అయ్యప్ప – కాశీ భక్తులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు

తెలంగాణ క్యాబినెట్ సమావేశం నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో అయ్యప్ప – కాశీ భక్తులకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకొని భక్తుల్లో ఆనందం నింపారు. ప్రతి ఏడాది తెలంగాణ నుండి కాశీకి పెద్ద ఎత్తున భక్తులు వెళ్తుంటారు. ఆలా వెళ్లి అక్కడ సరైన వసతులు లేక ఇబ్బంది పడుతుంటారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కాశీ లో ఒక వసతి గృహాన్ని నిర్మించాలని కేబినెట్‌ నిర్ణయించడం జరిగింది. కాశీలో నిర్మించే వసతి గృహానికి రూ.25కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చర్యలు వేగంగా జరిగేందుకు గౌరవ మంత్రుల బృందం, చీఫ్‌ సెక్రెటరీని వీలైనంత త్వరగా కాశీ పర్యటన జరిపి.. అక్కడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి, స్థలం దొరక్క పోతే ప్రైవేటు స్థలమైనా కొని రూ.25కోట్లతో అన్ని వసతులతో సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అలాగే శబరిమలలోను రూ. 25 కోట్లతో వసతి గృహాలను నిర్మించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రతి ఏడాది తెలంగాణ నుండి లక్షల మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్తుంటారనే సంగతి తెలిసిందే. ఎంతో నిష్ట, భక్తితో అయ్యప్ప భక్తులు ఉపవాస దీక్షను నిర్వహిస్తూ వస్తుంటారు. శబరిమలకు వెళ్లిన సమయంలో కూడా రాష్ట్రం నుంచి వెళ్లిన భక్తులకు ఇబ్బంది జరుగుతున్నది. అక్కడ సైతం రూ.25కోట్లతో శబరిమలలో రాష్ట్రం తరఫున వసతి గృహం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించి సీఎంవో అధికారి ప్రియాంక వర్గీస్‌ను ముందు వెళ్లి.. కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని.. వెంటనే ప్రభుత్వం నుంచి స్థలాన్ని పొందాలని, ఆ తర్వాత మంత్రుల బృందం వెళ్లి అక్కడ పనులు ప్రారంభించాలని చెప్పి కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.