పెద్దన్న అన్నంత మాత్రాన వారిద్దరు కలిసినట్లుగా భావించాలా? : కిషన్ రెడ్డి

kishan-reddy

హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్న అని సంబోధించడం రాజకీయ చర్చకు దారి తీసిన అంశంపై కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోడీని పెద్దన్న అని రేవంత్ రెడ్డి ఎందుకు అన్నారో… ఆయననే అడగాలని వ్యాఖ్యానించారు. అయినా పెద్దన్న అన్నంత మాత్రాన వారిద్దరూ ఒక్కటి అయినట్లుగా భావిస్తారా? అని చురక అంటించారు. పెద్దన్న అని రేవంత్ రెడ్డి అన్నందుకు విపక్షాలు విమర్శిస్తే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని… ఎందుకంటే అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశమన్నారు.

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ సభలు విజయవంతమయ్యాయన్నారు. రేపటి నుంచి బిజెపి మేనిఫెస్టో కోసం సలహాలను, సూచనలను స్వీకరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలుపై స్పష్టత లేకుండా పోయిందని ఆరోపించారు. సగటు ప్రజల ఓట్లను కూడా తాము మోదీకి అనుకూలంగా కూడగట్టే విధంగా ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు.