జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ

cm-jagan

అమరావతిః బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతు సడలించాలని ఏపీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై నిన్న విచారణ జరిపిన సీబీఐ న్యాయస్థానం… కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో, సీబీఐ నేడు కోర్టులో తమ వాదనలు వినిపించింది. జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతున్న దశలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఓసారి ఆయన విదేశాలకు వెళ్లొచ్చారని గుర్తుచేసింది. వాదనలు విన్న అనంతరం సీబీఐ న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ మే 14న ఉంటుందని పేర్కొంది.

కాగా, సీఎం జగన్ కోర్టు అనుమతి వస్తే ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటన చేయాలని భావిస్తున్నారు. ఏపీలో మే 13న పోలింగ్ జరగనుండగా, ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్నాయి. ఈ వ్యవధిలో ఆయన కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.