నా భర్త హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావే కారణం : గంజి ప్రసాద్ భార్య

శనివారం ఉదయం ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జి.కొత్తపల్లిలో వైస్సార్సీపీ నాయకుడు గంజి ప్రసాద్‌ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వైస్సార్సీపీ నాయకుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గోపాలపురం వైస్సార్సీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వెళ్లారు. ఈ క్రమంలో గంజి ప్రసాద్‌ అనుచరులు ఎమ్మెల్యేను అడ్డుకొని ఆయన ఫై దాడికి దిగారు. గంజి ప్రసాద్‌ హత్య కు కారణం ఎమ్మెల్యే అని వారంతా ఆరోపించారు. తాజాగా గంజి ప్రసాద్‌ భార్య కూడా ఇదే మాట అన్నది.

గంజి ప్రసాద్ భార్య సత్యవని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తలారి ప్రోద్బలంతోనే ఎంపీటీసీ బజారియా అనుచరులు తన భర్తను హత్య చేశారని తెలిపారు. హోం మంత్రి వనితకు తన భర్త గంజి ప్రసాద్ అనుచరుడని… ఇకపై వాళ్ల ఆటలు సాగవని అన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని తెలిపారు.