రైతుల ఖాతాల్లోకి ఇన్ పుట్ సబ్సిడీని జమ చేసిన సీఎం జగన్

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న సీఎం

YouTube video
Disbursing of Input Subsidy to Farmers and Interest Subvention under YSR Sunna Vaddi Panta Runalu

అమరావతిః రబీ 2020-21 సీజన్ లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి రూ. 45.22 కోట్లు, ఖరీఫ్ 2021 సీజన్ లో అర్హత పొందిన 5.68 లక్షల మందికి రూ. 115.33 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని సిఎం జగన్‌ బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేశారు. దీంతోపాటు… గోదావరి వరదలు, అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న 45,998 మంది రైతులకు రూ. 39.39 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని అందించారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ..తమది రైతులకు అండగా నిలబడే ప్రభుత్వమని… రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. రాష్ట్రంలో 62 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందని చెప్పారు. వ్యవసాయ రంగంలో తాము కొత్త ఒరవడిని తీసుకొచ్చామని తెలిపారు.వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు రైతులను మోసం చేశారని జగన్ విమర్శించారు. రుణమాఫీకి చంద్రబాబు కేవలం రూ. 15 వేల కోట్లను మాత్రమే ఇచ్చారని… వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం రూ. 25,971 కోట్లను ఇచ్చిందని చెప్పారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకోగలిగితేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం రైతులకు క్రమం తప్పకుండా పరిహారం చెల్లిస్తోందని, ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో పరిహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం లేదని, సున్నా వడ్డీ పథకాన్ని ఎగ్గొట్టిందని అన్నారు. గత ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించాలని కోరారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/