వికారాబాద్ జిల్లా పరిధిలో దారుణం..కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారు

,

మద్యం ప్రియుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు కొంతమంది మద్యం యజమానులు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. వికారబాద్‌ జిల్లా పరిధిలోని 19 మండలాల్లోని మద్యం దుకాణాల యజమానులు ఇలా మద్యాన్ని కల్తీ చేస్తున్నట్లు బయటపడింది. ప్రముఖ బ్రాండ్లకు చెందిన బాటిళ్ల మూతలు ఓపెన్‌ చేసి అందులో చీప్‌ లిక్కర్, నీటిని కలిపి మల్లీ యథావిధిగా సీల్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారం చాలా రోజులుగా జరుగుతున్నా అధికారులు తమకేమీ తెలియనట్లు గా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో మొత్తం 59 వైన్‌ షాపులు, ఐదు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటికి తోడు గ్రామాలు, తండాల పరిధిలోని ఐదు నుంచి పది వరకు బెల్టు షాపులు ఉన్నాయి. తక్కువ ధరకు లభించే మద్యాన్ని ఎక్కవ ధర ఉన్న బాటిళ్లలో స్టిక్కర్లు, లేబుళ్లను మార్చుతూ విక్రయిస్తున్నారు. ప్రధానంగా పరిగి నియోజకవర్గంలోని పలు దుకాణాల్లో ఈ దందా కొనసాగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అధిక ధరలున్న మద్యం సీసాల లేబుళ్లను, స్టిక్కర్లను ఏమాత్రం తేడా లేకుండా ఓపేన్‌ చేసి మళ్లీ సీల్‌ వేసేందుకు కొన్ని వైన్‌షాపుల యజమానులు స్థానికేతరులను, కల్తీ చేయడంతో అనుభవం ఉన్నవారిని తీసుకువస్తున్నట్లు సమాచారం. వారికి ఎక్కువ మొత్తంలో జీతాలు ఇచ్చి మద్యాన్ని ఇష్టానుసారంగా కల్తీ చేయిస్తున్నట్లు అంత చెపుతున్నారు. ఇంత భారీగా మద్యం కల్తీ చేస్తున్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి ఇకనైనా అధికారులు మేలుకొని వారిపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి.