నేటితో ముగిసిన మహేందర్ రెడ్డి పదవీకాలం

36 ఏళ్లుగా పోలీసు శాఖలో పని చేసిన మహేందర్ రెడ్డి

DGP Mahender Reddy
DGP Mahender Reddy

హైదరాబాద్‌ః తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఈరోజు పదవీ విరమణ చేశారు. నేటితో ఆయన పదవీకాలం ముగిసింది. రాష్ట్ర కొత్త డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలను స్వీకరించారు. తెలంగాణ పోలీస్ అకాడెమీలో పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 36 ఏళ్లుగా పోలీసు శాఖలో పని చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తన కెరీర్లో తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందనే అపోహలు వచ్చినప్పటికీ… వాటన్నింటినీ అధిగమించామని చెప్పారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ పోలీసు శాఖకు దిశానిర్దేశం చేసి, శాంతిభద్రతల పర్యవేక్షణకు పెద్దపీట వేశారని కొనియాడారు. ఎంతో దూరదృష్టితో ముఖ్యమంత్రి పాలిస్తున్నారని ప్రశంసించారు. మోడ్రన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కు సహకరించారని చెప్పారు. ఐదేళ్ల పాటు డీజీపీగా ఉండే అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఇక టెక్నాలజీ సహాయంతో ఎన్నో కేసులను పరిష్కరించామని మహేదర్ రెడ్డి చెప్పారు. పోలీసులందరూ టెక్నాలజీతో పాటు అప్ డేట్ కావాలని సూచించారు. రానున్న రోజుల్లో డిజిటల్ రూపంలో నేరాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. కొత్త డీజీపీగా బాధ్యతలను చేబడుతున్న అంజనీకుమార్ కు అభినందనలు తెలియజేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/