బిజెపిని నా గురువుగా భావిస్తున్నాను: రాహుల్ గాంధీ

I consider BJP as my guru: Rahul Gandhi

న్యూఢిల్లీః బిజెపి పైన ,ఆ పార్టీ నేతలపై కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు చేశారు. తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్రను ప్రారంభించినప్పుడు ఒక సాధారణ పాదయాత్ర లాగే భావించానని, అయితే అడుగడుగున బిజెపి తమ యాత్రను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని వ్యాఖ్యానించారు.

బిజెపి నేతల విమర్శలతో భారత్‌ జోడో యాత్రకు భారీగా ప్రచారం జరిగిందని రాహుల్‌ చెప్పారు. అందుకు బిజెపి నేతలకు తాను కృతజ్ఞతలు చెబుతున్నానని ఎద్దేవా చేశారు. బిజెపి నేతలు ఇకపై కూడా తమను బాగా విమర్శించాలని కోరుకుంటున్నానని, దాంతో కాంగ్రెస్‌ పార్టీకి వారి భావజాలాన్ని అర్ధం చేసుకునే అవకాశం దక్కుతుందని అన్నారు. నాయకులు ఏం చేయకూడదనేది వాళ్లు (బిజెపి నేతలు) నాకు చేసి చూపిస్తున్నారని, అందుకే వారిని తన గురువులుగా భావిస్తున్నానని, రాహుల్‌ వ్యాఖ్యానించారు.

ఇక, భారత్‌ జోడో యాత్రకు తనను ఆహ్వానించలేదన్న యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపణలపై రాహుల్‌గాంధీ స్పందించారు. తమ యాత్రకు అందరూ ఆహ్వానితులే అన్నారు. అఖిలేష్‌ యాదవ్‌, మాయావతితోపాటు చాలామంది ప్రేమతో నిండిన భారత దేశాన్ని కోరుకుంటున్నారని, వారికి, మాకు (కాంగ్రెస్‌) మధ్య సిద్ధాంతపరమైన స్వామ్యం ఉన్నదని, కాబట్టి అలాంటివారంతా ఏ సంకోచం లేకుండా భారత్‌ జోడో యాత్రలో పాల్గొనవచ్చని, వారిని ఎవరూ ఆపరని రాహుల్‌ పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/