పాము కాటుకు గురైన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురయ్యాడు. మహారాష్ట్రలోని పన్వేల్‌లో తన ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పాము కాటు వేయడం తో సల్మాన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే సల్మాన్‌ను విషం లేని పాము కాటేయడం తో పెను ప్రమాదం తప్పింది. పాము కాటు నేపథ్యంలో ముందు జాగ్రత్తగా సల్మాన్ ఖాన్ నవీ ముంబైలోని కమోతే ప్రాంతంలోని MGM (మహాత్మా గాంధీ మిషన్) ఆసుపత్రిలో చేరాడు.

చికిత్స అనంతరం సల్మాన్ ఖాన్ ఆదివారం ఉదయం 9 గంటలకు తన పన్వెల్ ఫామ్‌హౌస్‌కి తిరిగి వచ్చారు. సల్మాన్ ఫామ్ హౌస్ చుట్టూ కొండలు, అటవీ ప్రాంతం ఉండడంతో తరచుగా ఈ కాంప్లెక్స్‌లోకి పాములు, కొండచిలువలు వస్తుంటాయి. సరదాగా బయటి ప్రాంతంలో తిరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తెలియవస్తోంది. రేపు సల్మాన్ పుట్టిన రోజు. ఈ క్రమంలో ఈయన పాము కాటుకు గురి కావడం అభిమానులను ఆందోళనలో పడేసింది.

ఇక హిందీ బిగ్ బాస్ 15 వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో, కంటెస్టెంట్లతో కలిసి హోస్ట్ సల్మాన్ క్రిస్మస్‌తో పాటు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. RRR హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు దర్శకుడు SS రాజమౌళితో కలిసి ఆలియా భట్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ప్రొమోలో అలియా సల్మాన్ కోసం పుట్టినరోజు పాటను పాడటం చూడవచ్చు. RRR సహనటులు ఆమెతో కలిసి వేదికపైకి వచ్చి సల్మాన్‌తో పుట్టినరోజు కేక్‌ను కట్ చేయించారు.