మందు బాబులకు షాకింగ్ న్యూస్ : ఇక పగటిపూట కూడా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు

మందు బాబులకు షాకింగ్ న్యూస్ తెలిపారు పోలీసులు. ఇప్పటివరకు రాత్రిపూట మాత్రమే డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేసేవారు. కానీ ఇకనుండి పగటిపూట కూడా డ్రంకెన్ డ్రైవ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. పీకల్లోతు మద్యం తాగి..రోడ్లపైకి తమ వాహనాలతో వచ్చి ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నారు. పోలీసులు కేవలం రాత్రి వేళల్లోనే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తుడటంతో… ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పబ్బులు, బార్లలలో ఫుల్ గా తాగేసి… వాహనాలు నడుపుతున్నారు. వీరిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, ఇంజినీరింగ్ విద్యార్థులు ఉంటున్నారు. ఈ తరహాలోనే ఇటీవల బంజారాహిల్స్‌లో రోహిత్‌గౌడ్, సోమన్‌లు మద్యం మత్తులో కారు నడిపి… ఇద్దరు యువకుల ప్రాణాలు తీశారు. ఈ ఘటన మరువక ముందే గచ్చిబౌలి పరిధిలో ఇద్దరు యువతులు, ఓ యువకుడు దుర్మరణం చెందారు. అందుకే ఇక పట్టపగలు కూడా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేయాలనీ డిసైడ్ అయ్యారు.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్‌, సికింద్రాబాద్‌లోని ప్రాంతాలతో పాటు అబిడ్స్, కోఠీ, అంబర్‌పేట, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణగూడ, లిబర్టీలో పగటిపూట డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించనున్నారు. మద్యం మత్తులో వాహనాలను నడిపే వారిని గుర్తించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పోలీసులు… ఒకరోజు బేగంపేట-సికింద్రాబాద్‌ మార్గంలో… మరోరోజు జూబ్లీహిల్స్‌-మాదాపూర్‌ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టనున్నారు. ఇంకోరోజు కోఠీ-నాంపల్లి-ఖైరతాబాద్‌ మార్గంలో డ్రైవ్‌ చేపడుతున్నారు.