ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి

Deputy CM Bhatti launched electric buses

హైదరాబాద్‌ః టీస్ఆర్టీసీలో కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సులను ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి మాట్లాడుతూ.. గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం ఇబ్బంది పడేవారని.. ఆర్టీసీ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదన్నారు.

ఆర్టీసీ కార్మికులకు భావ ప్రకటన స్వేచ్చ ఉండేది కాదన్నారు. రాష్ట్రంలో సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లోనే వేల సంఖ్యలో ఉద్యోగులు ఉంటారన్నారు. టీఎస్‌ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వ సహాయం అందుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు. మహాలక్ష్మిగా కీర్తించే మహిళలు గౌరవంగా బస్సులో ప్రయాణిస్తున్నారన్నారు. మహిళల టికెట్ డబ్బులను ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. ఒక కార్మికుడిలా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలను మూడు నెలల్లోనే అమలు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి పాల్గొన్నారు.