సీఏఏ అమలుపై స్పందించిన పాక్‌ మహిళ సీమా హైదర్‌

Pakistani woman Seema Haider reacted to the implementation of CAA

న్యూఢిల్లీః వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మోడీ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. దీనిపై భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ స్పందించారు. సీఏఏ అమలును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై ప్రశంసలు కురిపించింది. మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు.

‘భారత ప్రభుత్వం ఈ రోజు మన దేశంలో పౌరసత్వ (సవరణ) చట్టాన్ని అమలు చేసింది. సీఏఏ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన చూశాక చాలా సంతోషం అనిపించింది. ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము. నిజంగా మోడీ జీ చేసిన వాగ్దానం నిలబెట్టుకున్నారు. నా జీవితాంతం వారికి రుణపడి ఉంటాను. ఈ చట్టంతో మేం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, నాకు భారత పౌరసత్వం వచ్చేందుకు ఈ చట్టం తోడ్పడుతుందని నమ్ముతున్నా’ అని సీమా హైదర్‌ ఒక వీడియో సందేశంలో పేర్కొంది. ఈ మేరకు సీఏఏ అమలు చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. నాలుగేండ్ల కిందట ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)ను తాజాగా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన వారు భారత పౌరసత్వం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, దీని కోసం వెబ్‌ పోర్టల్‌ను కూడా సిద్ధం చేసినట్టు హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. విపక్షాల తీవ్ర నిరసనల మధ్య 2019 డిసెంబర్‌ 11న సీఏఏ బిల్లు-2019 పార్లమెంటు ఆమోదం పొందిన విషయం తెలిసిందే.