ఢిల్లీ-పుణే విస్తారా విమానానికి బాంబు బెదిరింపు కాల్‌

Delhi to Pune Vistara flight receives bomb threat, probe on

న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి పుణే వెళ్లాల్సిన విస్తారా విమానంలో బాంబు ఉంద‌ని స‌మాచారం రావ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమానం నిలిపివేసిన అనంత‌రం క్షుణ్ణంగా త‌నిఖీలు చేప‌ట్టారు. జీఎంఆర్ కాల్ సెంట‌ర్‌కు శుక్ర‌వారం బాంబు బెదిరింపు కాల్ వ‌చ్చింది. ఢిల్లీ నుంచి పుణే వెళ్లాల్సిన యూకే971 విమానంలో భ‌ద్ర‌తా త‌నిఖీలు నిర్వ‌హించాల్సి ఉన్నందున జాప్యం నెల‌కొంద‌ని, భ‌ద్ర‌తా సంస్ధ‌ల‌కు తాము స‌హ‌క‌రిస్తున్నామ‌ని విస్తారా ప్ర‌తినిధి ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్క‌న్నారు. బాంబు బెదిరింపు నేప‌ధ్యంలో విమానాశ్ర‌యంలోని నిర్జ‌న ప్ర‌దేశంలో విమానంలో అణువ‌ణువునూ గాలిస్తున్నారు.

ప్ర‌యాణీకులంద‌రితో పాటు వారి ల‌గేజీని విమానం నుంచి బ‌య‌ట‌కు తీసుకువ్చారు. విమానం టేకాఫ్ తీసుకోవ‌డంలో జాప్యం కార‌ణంగా ప్ర‌యాణీకులు విశ్రాంతి తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామ‌ని విస్తారా ప్ర‌తినిధి తెలిపారు. శుక్ర‌వారం ఉద‌యం బోర్డింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతుండ‌గా ఏడు గంట‌ల ప్రాంతంలో బాంబు బెదిరింపు కాల్ వ‌చ్చిన‌ట్టు అధికార వ‌ర్గాలు తెలిపాయి.