ఢిల్లీలో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం

దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పటికే వరుసగా మూడురోజులుగా వాయు కాలుష్యం అతి తీవ్రస్థాయిలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక శనివారం ఉదయం నాటికి చూసుకుంటే వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 504కి చేరిపోయింది. జహంగీర్‌పురిలో ఈ సూచీ 702, సోనియా విహార్‌లో 618కి పడిపోవడాన్ని చూస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది.

మరోవైపు ఢిల్లీలో విష వాయువుల గాఢత (పీఎం) 2.5 స్థాయిలోనే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జారీ చేసినటువంటి ప్రమాణాల కంటే దాదాపు 80 రెట్లు అధికంగా ఉంది. అయితే ఈ గాలిని పీల్చుకోవడం వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికావడం, అలాగే కంటి దురద, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో జీఆర్ఏపీ స్టేజ్ త్రీ కింద ఢిల్లీలో ఆంక్ష‌లు విధించారు. నిర్మాణ ప‌నులపై ఆంక్ష‌లు విధించారు. లైట్ క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాలు, డీజిల్ ట్ర‌క్కుల ఎంట్రీపై కూడా నిషేధం అమ‌లు చేస్తున్నారు. ఢిల్లీలో నెలకొన్న ఈ తాజా పరిస్థితులపై ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సీఎన్‌జీ, విద్యుత్తు, బీఎస్‌ 4 ప్రమాణాలు కలిగిన వాహనాలకు మాత్రమే రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇక రానున్న దీపావళి పండుగతో పాటు పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేతతో వాయుకాలుష్యం మరింతగా క్షిణించనుందని లేఖలో పేర్కొన్నారు.