లాలూకు షాక్‌.. బెయిల్‌పై సుప్రీం కోర్టుకు సీబీఐ

CBI challenges Lalu Prasad Yadav’s bail in Supreme Court in fodder scam case

న్యూఢిల్లీః ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ మరో షాక్ ఇచ్చింది. దాణా కుంభకోణం కేసుల్లో ఆయనకు మంజూరైన బెయిల్‌ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లాలూ బెయిల్​ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. సీబీఐ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆగస్టు 25న విచారించనుంది.

దాణా కుంభకోణానికి సంబంధించిన పలు కేసుల్లో జైలు శిక్ష పడిన లాలూ ప్రస్తుతం బెయిల్‌పై బయటే ఉన్న విషయం తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా ఝార్ఖండ్‌ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన లాలూ గతేడాది డిసెంబరులో సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆయన కుమార్తె రోహిణి తండ్రికి కిడ్నీ దానం చేశారు. ఆ ఆపరేషన్‌ తర్వాత లాలూ కోలుకున్నారు. ఇటీవల విపక్షాల ఉమ్మడి కూటమి సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన బెయిల్‌ను సవాల్‌ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమవుతోంది.