ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత మాఫియా డాన్ అవతారం ఎత్తిదంటూ దాసోజు శ్రవణ్ ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు..టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ..ఢిల్లీలో మాఫియా డాన్ అవతారం ఎత్తిదంటూ బిజెపి నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. లిక్కర్ మాఫియాతో కవితకు ఉన్న సంబంధాలు బయటికి రాకుండా ఉండేందుకు.., ప్రజల దృష్టి మళ్లించేందుకు బండి సంజయ్ను అరెస్ట్ చేశారని శ్రవణ్ అన్నారు. లిక్కర్, డ్రగ్, సాండ్ మాఫియాతో కేసీఆర్ కుటుంబానికి ప్రమేయం ఉందన్నారు. కోట్ల రూపాయల దొంగ సొమ్మును దండుకునేందుకే లిక్కర్ మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని చెప్పారు.

వినాశకాలే విపరీతబుద్ధి అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గాంధేయ పద్ధతిలో ధర్మదీక్షకు కూర్చుంటే అక్రమంగా అరెస్టు చేసి కరీంనగర్కు తరలించారని ఆయన అన్నారు. లిక్కర్ మాఫియాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వస్తే..ఆమె ఏదో గొప్ప పని చేసినట్టుగా మంత్రులంతా వెళ్లి కవితకు మంగళహారతులు పట్టి స్వాగతిస్తున్నారని దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. కేసిఆర్కు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా.. తన కూతుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలన్నారు.