రాష్ట్రపతి ఎన్నికలు : ఓటు వేసిన సీఎం కేసీఆర్

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక పోలింగ్ లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో కేసీఆర్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. కేసీఆర్‌తో పాటు శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ప్ర‌శాంత్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు లు ఓటు వేశారు.

గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ నిన్న పర్యటించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పర్యటన అనుకున్నప్పటికీ, ఈరోజు హైదరాబాద్ కు వచ్చేసారు కేసీఆర్. ఇక విప‌క్షాల అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ మ‌ద్ద‌తు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. రాష్టప్రతి ఎన్నికల్లో ఇప్పటి వరకు తెలంగాణ అసెంబ్లీలో 116 మంది ఎమ్మెల్యే లు తమ ఓటు వినియోగించుకున్నారు. ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గంగుల కమలాకర్, చెన్నమనేని రమేష్‍లు ఓటు వేయలేదు. కోవిడ్ కారణంగా సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఓటు వేయనున్నారు గంగుల కమలాకర్. తెలంగాణలో మొదటగా మంత్రి కేటీఆర్‌ ఓటువేశారు. అంతకు ముందు తెలంగాణ భవన్‌లో టీఆరెస్ ఎమ్మెల్యేలకు మాక్‌ పోలింగ్‌ ద్వారా అవగాహన కల్పించే బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్నారు.