భవిష్యత్‌లో అర్హులైన అందరికీ దళితబంధు సాయం: మంత్రి కెటిఆర్‌

Dalit bandhu help for all deserving in future: Minister KTR

హైదరాబాద్ : మంత్రి కెటిఆర్‌ హుస్సేన్‌సాగర్‌ తీరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మురుగు వ్యర్థాల రవాణా (సిల్ట్‌ కార్టింగ్‌) వాహనాలను ప్రారంభించారు. లబ్ధిదారులకు వాహనాలకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను అందించారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. దళితబంధు కింద మురుగు వ్యర్థాల రవాణా వాహనాలను 162 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశామని వివరించారు. దళితబంధు అందాల్సిన వారు ఇంకా లక్షల్లో ఉన్నారని వివరించారు. భవిష్యత్‌లో అర్హులందరికీ దళితబంధు ఇస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రతి దళిత కుటుంబానికి లాభం చేకూర్చే విధంగా దళితబంధు అందజేస్తామని కెటిఆర్‌ అన్నారు. దళితుల అభివృద్ధి కోసమే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. దమ్మున్న నాయకులతోనే ఇది సాధ్యమవుతుందని వెల్లడించారు.

“దళితబంధు అందాల్సిన వారు ఇంకా లక్షల్లో ఉన్నారు. భవిష్యత్‌లో అర్హులైన అందరికీ దళితబంధు సాయం అందిస్తామం. మహాత్మా గాంధీని ఆదర్శంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. శాంతియుత పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారు. కుల మతాలకు అతీతంగా ప్రజలకు పాలనను అందిస్తున్నారు. ఎలాంటి కులమత ఘర్షణలు లేకుండా కేసీఆర్ పాలిస్తున్నారు. కొంతమంది నాయకులు దిల్లీలో కూర్చొని నినాదాలు ఇస్తున్నారు. గాంధీ ఫోటోలు పెట్టుకోని ఫోజులు ఇవ్వడం తప్ప ఆచరణలో ఉండదు.” అని కెటిఆర్‌ అన్నారు.