కెనడాలో వాక్ స్వేచ్ఛను అణిచివేసేందుకు ట్రూడో ప్రయత్నిస్తున్నారు..సిగ్గు చేటు: మస్క్

‘Shameful’: Elon Musk accuses Justin Trudeau of ‘crushing free speech’

న్యూయార్క్ : కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ను వివాదాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఆయన తీసుకున్న మరో నిర్ణయం తీవ్ర విమర్శలపాలు చేస్తోంది. ఇటీవలే ట్రూడో ప్రభుత్వం ఆన్‌లైన్‌ సెన్సార్‌షిప్‌ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజా నిబంధనల ప్రకారం.. ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ కంపెనీలు ప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ విధానంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రముఖ జర్నలిస్ట్‌ గ్లెన్‌ గ్రీన్‌వాల్డ్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా పోస్టు చేశారు.

‘ప్రపంచంలో అత్యంత అణచివేతతో కూడిన ఆన్‌లైన్‌ సెన్సార్‌షిప్‌ నిబంధనలు కెనడానలో ఉన్నాయి. పాడ్‌కాస్ట్‌లను అందించే ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ సంస్థల పై నియంత్రణ కోసం ట్రూడో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. ఆయా కంపెనీలు ప్రభుత్వం వద్ద అధికారికంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది’ అని గ్లెన్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై స్పేస్‌ఎక్స్‌ అధినేత, ట్విట్టర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ఈ మేరకు ట్రూడోపై విరుచుకుపడ్డారు. ట్రూడో.. వాక్‌ స్వాంత్య్రాన్ని అణచివేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘కెనడాలో వాక్ స్వేచ్ఛను అణిచివేసేందుకు ట్రూడో ప్రయత్నిస్తున్నారు. సిగ్గుచేటు’ అని మస్క్ మండిపడ్డారు.