ముంబయిలో గాలివాన బీభత్సం..14 మంది మృతి..70 మందికి గాయాలు

Cyclone disaster in Mumbai..14 people killed..70 people injured

ముంబయి : ముంబయిలో గాలివాన బీభత్సం సృష్టించింది. దాదర్‌, కుర్లా, మాహిమ్‌, ఘాట్‌కోపర్‌, ములుండ్‌, విఖ్రోలి, సౌత్ ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం తేలికపాటి వర్షంతోపాటు, బలమైన ఈదురు గాలులు వీచాయి. ఘాట్‌కోపర్‌లోని సమతా నగర్‌లో 100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్‌ ఈదురుగాలుల పక్కకు ఒరిగింది. గాలి తీవ్రతకు పక్కనే ఉన్న రైల్వే పెట్రోల్‌ పంపుపై పడింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. 70 మంది గాయపడ్డారు. కూలిన హోర్డింగ్‌ కింద కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే.. ఈ హోర్డింగ్ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ముంబై నగరపాలక అధికారులు తెలిపారు. తాజాగా హోర్డింగ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

అయితే.. ఈ ఘటన జరిగిన కాసేపటికే వడాలా-అంటోప్ హిల్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న మరో టవర్ రోడ్డుపై కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలిచారు. ఎనిమిది వాహనాలు ధ్వంసం అయ్యాయి. దట్టమైన చల్లని వాతావరణం కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబయిలో 15 విమానాలను దారి మళ్లించారు. వర్షం, ఈదురుగాలి కారణంగా అనేక ప్రాంతాల్లో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కొన్నిచోట్ల వైర్లు తెగిపడ్డాయి. పలు మార్గాల్లో మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సెంట్రల్‌ రైల్వే రెండు గంటలకుపైగా లోకల్‌ రైలు సేవలను నిలిపివేసింది. అనేక చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.