ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారికి బంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ క‌విత‌

ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు ఎమ్మెల్సీ క‌విత‌. ఆదివారం ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయమే అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. శాఖలు సమర్పించి…….విశేష నివేదన చేశారు. కరోనా కారణంగా రెండేళ్లుగా అమ్మవారిని దర్శించుకొని భక్తులు ఈఏడాది పెద్ద ఎత్తున తరలివస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి తొలి బోనం సమర్పించారు. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా అందర్నీ ఆహ్వానించామని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత అమ్మ‌వారికి బంగారు బోనం సమర్పించి , మొక్కులు చెల్లించుకున్నారు. ఆల‌య అర్చ‌కులు క‌విత‌ను ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. క‌విత వెంట మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కుటుంబ స‌భ్యులు, డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీల‌త రెడ్డితో పాటు ప‌లువురు టీఆర్ఎస్ నాయ‌కులు ఉన్నారు. అంత‌కు ముందు మోండా మార్కెట్ డివిజ‌న్‌లోని ఆద‌య్య న‌గ‌ర్ లైబ్ర‌రీ నుంచి 2 వేల మంది మ‌హిళ‌ల‌తో ఎమ్మెల్సీ క‌విత‌ ర్యాలీగా బ‌య‌ల్దేరి అమ్మ‌వారి ఆల‌యానికి చేరుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌కు గుర్తింపు వచ్చిందని కవిత అన్నారు. ప్రజలందరూ సురక్షితంగా, పంటలకు నష్టం కలగకుండా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. అంతకుముందు ఉజ్జయిని అమ్మవారిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌, అంజనీ కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. ప్రకృతి విపత్తుల నుంచి అమ్మవారు ప్రజలను కాపాడుతుందని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా అమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన దత్తాత్రేయ.. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడమని వేడుకున్నారు.