టర్కీ భూకంపల ఫై మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి

టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన మూడు భారీ భూకంపాలతో ఆ దేశాలు అల్లాడిపోయాయి. వేలాది భవనాలు నేలమట్టం కాగా, అందులో వేలాదిమంది చిక్కుకొని ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం నాల్గు వేల మంది మృత దేహాలు బయటకు తీయడం జరిగింది. ఇంకా వెలికితీత పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అంచనా ప్రకారం మృతుల సంఖ్య 20 వేల వరకు చేరే అవకాశం ఉందని డబ్లూ‌హెచ్‌వో చెపుతుంది.

ఈ భారీ భూకంపాల పట్ల బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ట‌ర్కీ, సిరియాలో చోటు చేసుకున్న భూకంప దృశ్యాలు త‌న‌ను తీవ్రంగా క‌లిచివేశాయ‌ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఘ‌ట‌న మాన‌వాళికి చాలా బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు. ట‌ర్కీ, సిరియా ప్ర‌జ‌ల‌కు ఆ భ‌గ‌వంతుడు మ‌రింత శ‌క్తినివ్వాల‌ని ప్రార్థించారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు కేటీఆర్.

మరోపక్క టర్కీకి సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే భారత్ వంద మంది సిబ్బందితో కూడిన రెండు బెటాలియన్ల ఎన్డీఆర్ఎఫ్ బలగాలతోపాటు.. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్న వారిని గుర్తించే రెండు శునకాలను రెస్క్యూ ఆపరేషన్ కోసం పంపించడం జరిగింది. ఘజియాబాద్ నుంచి ఒకటి, కోల్‌కతా నుంచి మరొకటి చొప్పున ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కేంద్రం టర్కీకి పంపించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ సహయక చర్యల్లో పాల్గొననున్నారు. వీరికి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉందని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ అతుల్ కర్వాల్ తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టడం కోసం వారు తగిన శిక్షణ పొంది ఉన్నారని ఆయన తెలిపారు.

మృతులకు ఇతర దేశాలు సంతాపం ప్రకటిస్తున్నాయి. 2021 ఆగస్టులో రిమోట్ సౌత్ అట్లాంటిక్‌లో సంభవించిన భూకంపం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద భూకంపం ఇప్పుడు సిరియా, టర్కీలో నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.