సీపీ సజ్జనార్ బదిలీ..ఆయన స్థానంలో ఎవరంటే ..

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా అదరగొట్టిన సజ్జనార్ బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో స్టీఫెన్ రవీంద్రను కొత్త సీపీగా ప్రభుత్వం నియమించింది. సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసింది. సైబరాబాద్ సీపీగా 2013 మార్చి 18న బాధ్యతలు చేపట్టిన సజ్జనార్.. సర్వీసులో తనదైన ముద్ర వేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు…. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్నలను అందుకున్నారు. ఇక రెండేళ్ల కిందట జరిగిన దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌తో సీపీ సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. వెటర్నరీ డాక్టర్‌ దిశను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన కేసులో నలుగురు నిందితులు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లగా పోలీసుల తుపాకులు లాక్కుని కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపామని.. కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అప్పట్లో సంచలనంగా మారింది. సీపీ సజ్జనార్‌పై ప్రశంసల వర్షం కురిసింది. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్ ఎస్పీగా పనిచేస్తున్న సమయంలోనూ యాసిడ్ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌తో హాట్‌టాపిక్‌గా మారారు.

ఇక స్టీఫెన్ రవీంద్ర‌ విషయానికి వస్తే..సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర వస్తారని కొంతకాలంగా పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన్ను ఏపీ క్యాడర్‌కి తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. ఆయనను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించాలని జగన్ పావులు కదిపినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే కేంద్రం నుంచి సానుకూలత రాకపోవడంతో స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ క్యాడర్‌లో విధులు నిర్వ్హయిస్తూ..ఇప్పుడు సైబరాబాద్ కమిషనర్‌గా నియమితులయ్యారు.