కర్నూలు మెడికల్‌ కాలేజ్ లో 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌

కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం రేపుతోంది. 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ తేలడం అందర్నీ భయాందోళనలో పడేసింది. రాష్ట్రంలో కరోనా కేసులతో పాటు , ఓమిక్రాన్ కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకల అనంతరం కేసులు మరి ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 50 మంది వైద్య విద్యార్థులకు వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 11 మందికి, నలుగురు హౌస్ సర్జన్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం బాధితులంతా జీజీహెచ్ పెయింగ్ బ్లాక్‌లో చికిత్స పొందుతున్నారు. మరో 40 మంది వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్ సేకరించిన వైద్య సిబ్బంది వాటిని ల్యాబ్‌కు పంపారు.

మెడిక‌ల్ కాలేజీలోని విద్యార్థుల‌కు క‌రోనా సోక‌డంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగిన వారిని ఐసోలేష‌న్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అటు కాలేజీ మొత్తం సానిటైజ్‌ చేస్తున్నారు అధికారులు. ఇక ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 1257 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,81, 859 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఇద్దరూ చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 505 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4774 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.